TELANGANA SONG

జయజయహే తెలంగాణ పాట 
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం   || జయ…||
తరతరాల చరితగల తల్లీ నీరాజనం   || తర…||
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ     || జై…||
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడేలే బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్    || జై…||
జానపదా జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృతపరచే గీతాలా జనజాతర
అనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం    || జై…||
సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పూవులపొద
సిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద    || జై…||
గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి    || జై…||